కళ్ల ముందు 246 పరుగుల భారీ లక్ష్యం... వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓటమి పాలైన జట్టు..300 ఈజీగా కొట్టేస్తుందనే హైప్ సంగతులు పక్కన పెడితే కనీసం 120 పరుగులు చేయలేక ఈ సీజన్ లో ఇబ్బందులు పడుతున్న టీమ్ ఫేట్ ను ఒకే ఒక్క సంచలన ఇన్నింగ్స్ తో మార్చేశాడు ఈ బక్కపలుచటి కుర్రాడు. పేరు అభిషేక్ శర్మ. వయస్సు 24ఏళ్లు. టీమిండియా దిగ్గజం యువరాజ్ సింగ్ శిష్యుడు. సన్ రైజర్స్ ను ఎందుకు కాటేరమ్మ కొడుకులు అంటారే తెలిసేలా హెడ్ మాస్టర్ తో కలిసి ఉప్పల్ లో ఊచకోత కోశాడు. హెడ్ మాస్టర్ తో కలిసి పంజాబ్ మీద చేసిన దాడి మాటలకు అందనిది. వర్ణనకు దొరకనిది. 21 బంతులకే హాఫ్ సెంచరీ..40 బంతుల్లో సెంచరీ..వదిలితే నిన్న క్రిస్ గేల్ 175పరుగుల రికార్డు కూడా బద్ధలు కొట్టేవాడు. అంత ఆకలి మీదున్న ఉన్నాడు అభిషేక్ శర్మ. ఈ సీజన్ లో మొన్నటి వరకూ ఆడిన 5 మ్యాచుల్లో ఒక్క సిక్స్ కూడా కొట్టలేకపోయిన అభిషేక్...నిన్న ఒక్క మ్యాచులోనే పది సిక్సర్లు బాది రుద్ర తాండవం ఆడాడు. 106 మీటర్ల భారీ సిక్సు కొట్టాడు స్టేడియం అవతలకు. కొండంత లక్ష్యాన్ని మంచుగడ్డలా కరిగించేస్తూ వీర విధ్వంసమే సృష్టించాడు. 55 బంతుల్లోనే 14ఫోర్లు 10 సిక్సర్లతో 144 పరుగులు చేసి అవుటైన అభిషేక్...అప్పటికే సన్ రైజర్స్ విక్టరీని డిసైడ్ చేసేసి వెళ్లాడు. సెంచరీ చేశాక అభిషేక్ సెలబ్రేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. హాఫ్ సెంచరీ కొట్టి L సింబల్ చూపిస్తూ ఫ్యాన్స్ మీద తన లవ్ ప్రకటించే అభిషేక్ సెంచరీ పూర్తయ్యాక తన జేబులో నుంచి ఓ చీటీ తీసి అందరికీ చూపించాడు. దానిపైనే దిస్ వన్ ఈజ్ ఫర్ ఆరెంజ్ ఆర్మీ అని రాసుకొచ్చాడు. ఎంత కాన్ఫిడెన్స్ తన మీదకు తనకు. అలా రాసుకొచ్చి మరీ సెంచరీ కొట్టి ఫ్యాన్స్ కి గిఫ్ట్ ఇవ్వటానికి. కావ్యా మారన్ లేదు ప్రీతి జింతా లేదు SRH పంజాబ్ అనే తేడా లేదు అభిషేక్ వీర బాదుడు ఇన్నింగ్స్ కి అందరూ ఫిదా అయిపోయారు నిన్న.అందుకే అవుట్ అవగానే టీమ్స్ తో సంబంధం లేకుండా అందరూ వచ్చి అభిషేక్ శర్మను అభినందించి ఆ సంచలన ఇన్నింగ్స్ ను మరింత స్పెషల్ చేశారు.